కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అది ఇప్పటికే ఎన్నో మరణాలకు కారణం అవ్వడంతో పాటు మరెన్నో జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సహా భారత ప్రభుత్వం మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంది. మనలో ప్రతి ఒక్కరికీ ఇదెంతో క్లిష్టమైన సమయం. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సూచనలు పాటించడం మరియు కరోనాను తరిమి వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు పాటించడం అత్యంత ఆవశ్యకం.
మరీ ముఖ్యంగా కోవిడ్ -19 ప్రమాదం వృద్ధులకు ఎక్కువగా ఉంది. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్ర పిండ వ్యాధులు లాంటి కారణాల వల్ల కరోనా సైతం తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. కోవిడ్ -19 కారణంగా ఇప్పటి వరకూ సంభవించిన మరణాల్లో అత్యధికం వృద్ధులువే కావడం గమనించాల్సిన అశం.
అయితే సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించవచ్చు.
చేయతగినవి
- ఇంటికే పరిమితం కావాలి. బయటవారిని ఇంట్లో కలవడం మానుకోవాలి. కలవడం తప్పని సరి అయితే, ఒక మీటరు సామాజిక దూరాన్ని పాటిస్తూ కలవాలి.
- సబ్బు మరియు నీటితో ఎప్పటికప్పుడు చేతులు, ముఖం కడుగుతూ ఉండాలి.
- తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు మీ అరచేతిని గాక మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. లేదా టిష్యూ లేదా రుమాలును అడ్డు పెట్టుకోవాలి. అనంతరం వెంటనే వాటిని పారేయడం లేదా ఉతకడం, కడగడం లాంటివి చేయాలి.
- ఇంట్లో వండిన తాజా వేడి వేడి భోజనాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అందులో సరైన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు నీటితో పాటు తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.
- వ్యాయామం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి.
- వైద్యులు సూచించిన రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- మీకు అందుబాటులో లేని మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫోన్ ద్వారా మాట్లాడడం లేదా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండండి. అవసరమైతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.
- కంటి శుక్లాల శస్త్ర చికిత్స లేదా మోకాలి శస్త్ర చికిత్స వంటి అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు (ఏవైనా ఉంటే) వాయిదా వేయడం ఉత్తమం.
- ఇంట్లో మీరు తాకిన నేలను క్రిమి సంహారక ద్రావణాలతో క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ ఉండాలి.
- ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండాలి. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి, వైద్య సలహాలు, సూచనలు పాటించండి.
చేయకూడనివి
- ముఖాన్ని కప్పుకోకుండా దగ్గడం లేదా తుమ్మడం లాంటివి చేయకూడదు.
- జ్వరం మరియు దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవడం లాంటివి చేయకూడదు.
- కళ్లు, ముక్కు, ముఖం, నాలుకను తాక కూడదు.
- కరోనా బారిన పడ్డవారు లేదా అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరకు వెళ్ళకూడదు.
- వైద్యుల సలహాలు లేకుండా ఎలాంటి ఔషధాలను తీసుకోకూడదు.
- స్నేహితులు, బంధువులతో కరచలనాలు, ఆలింగనాలు వంటివి చేయకూడదు.
- ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్ళవద్దు. సాధ్యమైనంత వరకూ టెలిపోన్ సంప్రదింపుల ద్వారా వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది.
- పార్కులు, మార్కెట్లు మరియు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళవద్దు.
- కచ్చితంగా అవసరమైతే తప్ప బయటకు రాకూడదు.